ఏఐ రాకతో టెక్ రంగంలో ఉద్యోగాల ఊచకోత.. 5 నెలల్లో 92,000 మంది తొలగింపు

  • 2026 మొదటి ఐదు నెలల్లోనే టెక్ రంగంలో 92వేల‌ మంది ఉద్యోగుల‌పై వేటు
  • ఏఐ వినియోగం, ఖర్చుల నియంత్రణను కారణంగా చూపుతున్న కంపెనీలు
  • మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల్లో భారీగా ఉద్యోగాల కోత
  • ఉద్యోగులను తొలగిస్తూనే ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు కుమ్మరిస్తున్న టెక్ కంపెనీలు
2026 సంవత్సరం ప్రపంచ టెక్నాలజీ రంగానికి ఒక గట్టి హెచ్చరికలా మారింది. ఈ ఏడాది కేవలం ఐదు నెలలు గడిచేసరికే, వివిధ టెక్ కంపెనీల్లో ఏకంగా 92,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత రెండేళ్లలో చూస్తే, ఏప్రిల్ నెల అత్యంత దారుణంగా నిలిచింది. ఈ ఒక్క నెలలోనే 45,000 మంది ఉద్యోగులపై వేటు పడింది. కరోనా మహమ్మారి సమయంలో భారీగా నియామకాలు చేపట్టిన కంపెనీలు, ఇప్పుడు ఖర్చుల నియంత్రణ, కృత్రిమ మేధ (ఏఐ) ఆధారిత సామర్థ్యం పెరగడం వంటి కారణాలతో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

మెటా, స్నాప్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, బ్లాక్, అమెజాన్ వంటి దిగ్గజ సంస్థలు ఈ ఏడాది ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఈ పరిణామాలు టెక్ ఉద్యోగులలో తీవ్ర భయాందోళనలను సృష్టిస్తున్నాయి.

దిగ్గజ కంపెనీల్లో భారీ కోతలు
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా, ఈ లేఆఫ్స్‌లో అతిపెద్ద అడుగు వేసింది. ఏప్రిల్ 22న దాదాపు 8,000 మంది ఉద్యోగులను, అంటే తమ మొత్తం సిబ్బందిలో 10 శాతం మందిని మే 20 నాటికి వైదొలగాలని ఆదేశించింది. మరో 6,000 ఖాళీలను భర్తీ చేయకుండా నిలిపివేసింది. మరోవైపు ఏఐ అభివృద్ధి కోసం భారీగా మూలధన వ్యయం చేస్తోంది.

స్నాప్‌చాట్ మాతృసంస్థ స్నాప్ కూడా 1,000 మంది ఉద్యోగులను (16% సిబ్బంది) తొలగించింది. తమ కోడింగ్‌లో 65 శాతానికి పైగా ఏఐ సాంకేతికతే పూర్తిచేస్తోందని, దీంతో చిన్న బృందాలతోనే పని చేయగలమని సీఈఓ ఇవాన్ స్పీగెల్ తెలిపారు.

మైక్రోసాఫ్ట్ మాత్రం కాస్త భిన్నమైన మార్గాన్ని ఎంచుకుంది. తమ 50 ఏళ్ల చరిత్రలో తొలిసారిగా అమెరికాలోని సీనియర్ ఉద్యోగులకు స్వచ్ఛంద పదవీ విరమణ (వాలంటరీ ఎగ్జిట్) పథకాన్ని ప్రవేశపెట్టింది. ఉద్యోగి వయస్సు, సర్వీస్ కలిపి 70 ఏళ్లు దాటిన వారికి ఈ అవకాశం కల్పించారు.

ఇక, అమెజాన్ దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగాలను దశలవారీగా తొలగించింది. ఒరాకిల్ కూడా భారత్, అమెరికా, కెనడాలోని ఉద్యోగులకు ఉదయాన్నే టర్మినేషన్ ఈమెయిళ్లు పంపి విమర్శల పాలైంది. జాక్ డోర్సీ నేతృత్వంలోని బ్లాక్ ఇంక్., ఏకంగా 40% సిబ్బందిని, అంటే 4,000 మంది ఉద్యోగులను తగ్గించాలని నిర్ణయించడం గమనార్హం.

ఏఐ విప్లవం.. ఉద్యోగుల్లో భయం
చాట్‌జీపీటీ, క్లాడ్ వంటి ఏఐ సాధనాలు పనివిధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. చాలా పనులను ఆటోమేట్ చేయగలమని కంపెనీలు భావిస్తున్నాయి. ఇది కేవలం తాత్కాలిక ఖర్చుల తగ్గింపు చర్య కాదని, భవిష్యత్తులో పని చేసే విధానంలో రాబోతున్న శాశ్వత మార్పుకు ఇది ఆరంభమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఈ పరిణామాలతో టెక్ ఉద్యోగుల్లో ఆందోళన తీవ్రస్థాయికి చేరింది. గ్లాస్‌డోర్ ఎంప్లాయీ కాన్ఫిడెన్స్ ఇండెక్స్ ప్రకారం, టెక్ వర్కర్లలో ఆత్మవిశ్వాసం 47.2 శాతానికి పడిపోయింది. మార్కెట్‌లోని అనిశ్చితి కారణంగా ఉద్యోగులు స్వచ్ఛందంగా ఉద్యోగాలు మారడానికి జంకుతున్నారు. ఇదే అదనుగా కంపెనీలు లేఆఫ్స్, కఠినమైన పనితీరు సమీక్షల విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్నాయని గ్లాస్‌డోర్ ఆర్థికవేత్త డేనియల్ జావో తెలిపారు.

ఒకవైపు ఉద్యోగాల కోత విధిస్తున్నప్పటికీ, మరోవైపు ఆల్ఫాబెట్, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు ఏఐపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 2026లో ఈ నాలుగు కంపెనీలు కలిపి దాదాపు 700 బిలియన్ డాల‌ర్లు ఖర్చు చేయనున్నాయని అంచనా. ఈ పరిణామాలు టెక్ ఉద్యోగులకు 2026 సంవత్సరాన్ని భయం, అనిశ్చితి, వేగవంతమైన మార్పులమయంగా మార్చేశాయి.

Tech Layoffs 2026
Meta Layoffs
Snap Layoffs
Microsoft Layoffs
Amazon Layoffs
AI Impact on Jobs
Job Cuts in Tech
Tech Industry Layoffs
Artificial Intelligence
Layoff Trends

More Telugu News